పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాటికన్ అధినేత పోప్ లియో మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇరాన్‌ తో అమెరికా యుద్ధాన్ని పోప్ వ్యతిరేకించడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘పోప్ గారు కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడటం మానుకోవాలి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌ విషయంలో కాల్పుల విరమణ విఫలమయ్యాక అమెరికా సైనిక చర్యలకు దిగుతుండటాన్ని పోప్ లియో ఇటీవల విమర్శించారు. యుద్ధం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతాయని, శాంతియుత చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఆగ్రహానికి కారణమయ్యాయి.

ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించిన ట్రంప్.. ‘ప్రపంచ భద్రత కోసం మేం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదు. ఆయన మత గురువులా వ్యవహరించాలి కానీ, రాజకీయ నాయకుడిలా కాదు. అమెరికా భద్రతా ప్రయోజనాలపై ఆయనకు అవగాహన లేదు’ అని విమర్శించారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను అణచివేయడం తన బాధ్యత అని, దీనికి మతం అడ్డురాకూడదని స్పష్టం చేశారు.

ప్రపంచంలోని ఇద్దరు అత్యంత శక్తిమంతమైన నేతల మధ్య జరిగిన ఈ వాగ్వాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఐరోపా దేశాలు, శాంతి కాముకులు పోప్‌కు మద్దతు తెలుపుతుండగా, ట్రంప్ మద్దతుదారులు మాత్రం దేశ రక్షణే ప్రథమ కర్తవ్యమని వాదిస్తున్నారు.


ట్రూత్ సోషల్ లో ట్రంప్ పెట్టిన పోస్టులోని ముఖ్యాంశాలు..

పోప్ సామర్థ్యంపై ప్రశ్నలు: నేరాల పట్ల పోప్ లియో మెతక వైఖరి కలిగి ఉన్నారని, విదేశాంగ విధానం విషయంలో ఆయనకు అవగాహన లేదని ట్రంప్ విమర్శించారు.
కోవిడ్ కాలం నాటి అరెస్టులు: కోవిడ్ సమయంలో చర్చి సేవలు నిర్వహించినందుకు మత గురువులను అరెస్టు చేసినప్పుడు పోప్ స్పందించలేదని, ఇప్పుడు తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కుటుంబ ప్రస్తావన: పోప్ సోదరుడు లూయిస్ తనకు ఇష్టమని, ఎందుకంటే ఆయన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’  సిద్ధాంతాన్ని నమ్ముతారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్, వెనిజులా: ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సమర్థించే పోప్ తనకు అవసరం లేదని, డ్రగ్స్ మరియు నేరస్థులను అమెరికాలోకి పంపుతున్న వెనిజువెలాపై తాను తీసుకున్న చర్యలను పోప్ విమర్శించడం తగదని అన్నారు.
పదవిపై వ్యాఖ్యలు: పోప్ ఒక అమెరికన్ కావడం వల్లే చర్చి ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టిందని, తాను అధ్యక్షుడిగా లేకపోతే లియో వాటికన్‌లో ఉండేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హితవు: పోప్ రాజకీయ నాయకుడిలా ప్రవర్తించడం మానేసి, కామన్ సెన్స్ ఉపయోగించి క్యాథలిక్ చర్చి ప్రతిష్టను కాపాడాలని ట్రంప్ సూచించారు.

Donald Trump
Pope Leo
Iran
Vatican
US Foreign Policy
Trump vs Pope
Iran Nuclear Program
Make America Great Again
Catholic Church
International Relations

More Telugu News